కొత్తనీరు

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

కాకి తెగ అరుస్తోంది విడవకుండా!… “హుష్! ఎందుకే ముదనష్టపుదానా, అలా అరుస్తున్నావు?… మా ఇంట్లో ఉన్న గోల చాలదనా…? దిక్కుమాలిన సంతని దిక్కుమాలిన సంత. నీ అమ్మా కడుపు కాలిపోనూ. పోవే ముదనష్టపు ముండా!…” మా అత్తగారి అదిలింపు గొంతులో వినిపిస్తుంది. ఆ గొంతులో అక్కసుంది, అసహ్యం ఉంది. ఆ అసహ్యం అదలింపు తిట్లూ ఏ “కాకి” పయినో నాకు తెలుస్తూనే ఉంది. హృదయంలో ములుకుల్లా గ్రుచ్చుకుంటూనూ వుంది.

గది తలుపులు బిడాయించుకొని, లోపల ఒంటరిగా కూర్చున్నాను నేను. పగలే అయినా మూలగది కావడం వలన లైటు వేసుకోకపోతే కొంచెం చీకటిగా ఉంటుంది. గుండె బరువెక్కి, ఎవరో గట్టిగా పట్టి నొక్కుతున్నట్ట్లుగా ఉంది. ఎంత నిగ్రహించుకుందామని ప్రయత్నించినా మనసు నీరయిపోతుంది. పిల్లలు వచ్చినట్లున్నారు. “ఎవర్ని నాయనమ్మా తిడుతున్నావు?” అని అడుగుతున్నాడు బాబు మా అత్తగారిని. “కాకిని” మా అత్తగారి జవాబు. “ఎందుకూ?”

“ఒళ్ళు కొవ్వెక్కి అరుస్తున్నందుకు” గొంతులో విసుగు. “భలే, కాకి అరిస్తే చుట్టాలొస్తారుగదూ నానమ్మా?” పాప ప్రశ్న. “ఆ వస్తారొస్తారు రాకేం చేస్తారు? మన కొంపనుద్దరించొద్దు మరి. వెధవల్లారా, అన్నీ మీకే కావాలి. నన్ను విసిగించక బయటకి పొండి” “మా అమ్మేదీ?”

“ఏమో, ఎక్కడ చచ్చిందో, నాకు తెలియదు. ముందు బయటకు పొండి వెధవగోలా మీరూను…” మా అత్తగారి మాటలు నా చెవుల్లో రొద చేస్తున్నాయి. భరించలేక రెండు చేతులతో చెవులు మూసుకున్నాను. కళ్ళు మూసుకున్నాను గట్టిగా. చీకటి సరిపోవడంలేదు. ఆ సరిపోని చీకటిని అతి సులువుగా చీల్చుకొని పదే పదే సినిమా రీలు తిరిగినట్లు ప్రదర్శితమవుతుంది ఉదయం సంఘటన. ఇవాళ ఉదయం మా అత్తగారివెంట హాస్పిటల్ కు వెళ్ళాను. మా అత్తగారికి ఇంజక్షన్ ఇవ్వడం అయ్యేకా “నాలుగురోజులనుంచి నువ్వూ నీరసంగా వుటున్నావు కదా నువ్వూ చూపించుకోవే” అంది ఆవిడ.

వారం నుంచి నాకు నీరసంగా వుంటున్నమాట నిజమే కానీ, ఆ మాత్రం దానికి డాక్టరుకు చూపించుకోవడం అనవసరం అదే సర్ధుకుంటుందిలెమ్మనిపించి… “ఫరవాలేదులెద్దురూ” అని వద్దన్నాను. అయినా ఆవిడ వినిపించుకోలేదు. డాక్టరు పరిక్ష చేసేంతవరకు వదలనూ లేదు. అడగాల్సిన ప్రశ్నలు అవీ అడగడం అయినాక, చావు కబురు చల్లగా చెప్పిన్నట్లుగా “నువిప్పుడు గర్భవతివమ్మా” అని తేల్చి చెప్పింది డాక్టరు తాపీగా.

నా నెత్తిన పిడుగు పడినట్లైంది. తల దించుకొని వుండిపోయాను. కానీ, మా అత్తగారే నమ్మలేక రెండు మూడుసార్లు రెట్టించి మరీ అడిగింది ఏమిటన్నారు? అని ఎన్నిసార్లడిగినా సమాధానం అదే. దాంతో ఆవిడా కిమ్మనలేదు. ఆ తరువాత ఇంటికి ఎలా చేరుకున్నామో ఏమో? వచ్చీ రావడంతోనే మా గదిలోకిలా వచ్చి తలుపులు బిగించుకుని కూర్చుండిపోయాను. దారిలో మేం పన్నెత్తి కూడా మాట్లాడుకోలేదు. కనీసం ఆవిడవైపు చూడడానికి కూడా నాకు ధైర్యం సరిపోలేదు.

తన అక్కసు దాచుకోలేక అన్యాపదేశంగా వెళ్ళగ్రక్కుకుంటుంది మా అత్తగారు. ఆవిడ పేరు శాంతమ్మ. మనిషి కూడా స్వతహా పేరుకు తగినంత శాంతమూర్తి. నేనంటే ఎంతో ప్రేమాభిమానాలున్నాయి. నాకు పెళ్ళాయి కాపురానికొచ్చిన ఈ పన్నెడేళ్ళలోనూ మా అత్తాకోడళ్ళ మధ్య చిన్న గొడవైనా రాలేదంటే నమ్మరేమోగానీ… నిజం అదే. ఆవిడ కడుపు చించుకు పుట్టిన మావారు సత్యమూర్తి కూడా మంచితనంలో తల్లికి తగిన తనయులే. నేనంటే వల్లమాలిన ప్రేమ ఆయనకు. అటువంటి మంచి భర్త, అత్తగారు… ముత్యాల్లంటి ఇద్దరు పిల్లలతో వున్నా నా కాపురం చూసుకొని నేనే గర్వపడిన రోజులు అనేకం ఉన్నాయి.

ఇంతటి అనుకూల సంసారంలో ఇల్లాలు గర్భవతి కావడం ఇంటిల్లిపాదికీ ఆనందదాయకమే అవుతుంది. కానీ నా విషయంలో మాట్రం అందుకు వ్యతిరేకంగా పరిణమిస్తుంది. అయితే దానికి కారణం లేకపోలేదు. నాలుగేళ్ళ క్రితం పాప పుట్టినపుడు- మా అత్తగారికి అంతగా ఇష్టం లేకపోయినా పిల్లలు పుట్టకుండా వేసక్టమీ ఆపరేషను చేయించుకున్నారు మా ఆయన. అలా ఆయన ఆపరేషను చేయించుకున్నా.. ఇంతకాలం తరవాత నేను నెల తప్పడం జరిగిందంటే… నా పరిస్థితి మరింకెలా వుంటుంది?

ఏమయితేనేం- నా చేతులు కాలాయి. ఇప్పుడు ఏ ఆకుల్ని పట్టుకొని మాత్రం ఏమిటి ప్రయోజనం!… ఇంతలా చేతులు కాకి నా జీవితమే నాశనమవుతుందని ఏ మాత్రం తెలిసినా ఆ నిప్పు జోలికి వెళ్ళి వుండేదానిని కానేమో! ప్చ్… నా బ్రతుకుకు అంటిన ఆ నిప్పు- ప్రకాష్! అయితే తప్పంతా అతనిదే అని అనను. కానీ, అతను నా జీవితంలో ప్రవేశించకపోతే నా కాపురానికి బెడద వచ్చివుండేది కాదు. ప్రకాష్ కి ఇరవైయేళ్ళుంటాయి. కాలేజీలో బి.ఎ. చదువుకుంటున్నాడు. మంచి పర్సనాలిటీతో అందంగా వుంటాడు. అంతేగాక బుద్దిమంతుడిలా కనిపిస్తాడు. కనిపిస్తాడు అంటే అది వ్యంగ్యమనుకోకండి. నిజంగానే అతన్ని చూసినపుడు ఎవరికైనా మంచి కుర్రవాడనే భావం కలుగుతుంది.

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000